: బాబ్బాబు! చైనాని ఏమీ అనకు..!: ఇమ్రాన్ ఖాన్ తో కాళ్ల బేరానికి దిగిన చైనా రాయబారి
నవంబర్ 2న పాకిస్థాన్ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ ‘ఆక్యుపై ఇస్లామాబాద్’ (ఇస్లామాబాద్ ముట్టడి) పేరిట భారీ ఆందోళన చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు భారీ సన్నాహాలు చేస్తున్నామంటూ సింబాలిక్ గా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. అయితే, ఈ వీడియోను చూసిన ప్రధాని నవాజ్ షరీఫ్ భయపడాలి కానీ, దానికి భిన్నంగా చైనా బెంబేలెత్తిపోయింది. నవాజ్ షరీఫ్ మంత్రి వర్గంలో కొంత మంది చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) ను ఈస్టిండియా కంపెనీతో పోల్చిన నేపథ్యంలో చైనా రాయబారి ఆగమేఘాల మీద ఇమ్రాన్ ఖాన్ తో భేటీ అయ్యారు. ప్రధాని నవాజ్ షరీఫ్ ను లక్ష్యం చేసుకుని ఇమ్రాన్ చేపడుతున్న ఈ ర్యాలీలో బెలూచిస్థాన్ లో చైనా పెడుతున్న పెట్టుబడులను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయవద్దని బతిమాలుకున్నారు. 51 బిలియన్ డాలర్ల చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పై వ్యతిరేక విమర్శలు చేయవద్దని ఆయన కోరారని పాక్ మీడియా తెలిపింది. నవాజ్ షరీఫ్ కుటుంబసభ్యులు విదేశాల్లో నల్లధనం దాచుకున్నారంటూ పనామా పత్రాల్లో వెల్లడైనప్పటికీ ఆయన పట్టించుకోకపోవడం.. కశ్మీర్ విషయంలో ఆయన భారత్ కు దీటుగా ఏమీ చేయడం లేదంటూ విమర్శిస్తూ ఇమ్రాన్ ఖాన్ నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడికి పిలుపునిచ్చాడు. నవంబర్ 2న రాజధానిని పూర్తిగా స్తంభింపజేసి తమ సత్తా చూపిస్తామని ఆయన సవాలు విసురుతున్నారు. సైన్యంతో విభేదాలు ఉన్నాయన్న వార్తల నడుమ, సీపీఈసీపై కేబినెట్ సహచరులే విమర్శలు చేస్తున్న క్రమంలో ఇమ్రాన్ ర్యాలీ నవాజ్ షరీఫ్ కు పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.