: గాలి జనార్దన్ రెడ్డి కూతురి పెళ్లి .. వెడ్డింగ్ కార్డు అదిరింది!
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ ప్రముఖుడు, ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్ రెడ్డి లగ్జరీ జీవితం గడుపుతారన్న విషయం అందరికీ తెలిసిందే. బంగారు కుర్చీలో కూర్చోవడం, బంగారు పళ్లెంలో తినడంతో పాటు, బంగారు విగ్రహాలకు ఆయన పూజలు చేస్తారనే వార్తలు గతంలో హల్ చల్ చేశాయి. తాజాగా, జనార్దన్ రెడ్డి కూతురు బ్రహ్మణి వివాహం రాజీవ్ రెడ్డితో వచ్చే నెలలో జరగనుంది. ఈ వివాహం కూడా ఒక రేంజ్ లో జరగనుందనే వార్తలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, బ్రహ్మణి పెళ్లి శుభలేఖ ఒక రేంజ్ లో ఉందట. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వీడియోతో ఆహ్వాన పత్రికను ఒక ఖరీదైన జ్యూయలరీ బాక్స్ రూపంలో రూపొందించారు. దీని ప్రత్యేకత గురించి చెప్పాలంటే.. ఈ బాక్స్ తెరిచి చూడగానే ఎల్ సీడీ తెరపై ఒక పాట ప్లే అవుతుంది. ఇందులో గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి, కుమారుడితో కలిసి వధూవరులను పరిచయం చేశారు. ‘అతిథి దేవోభవ’ అంటూ మొదలయ్యే ఈ వీడియో సాంగ్.. తన కుమార్తె వివాహ తేదీని, వేదిక గురించి జనార్దన్ రెడ్డి చెప్పడంతో ముగుస్తుంది.