: అప్పులపాలైన 28 మంది రైతులకు ఇళ్లు కట్టించిన వరుణ్ గాంధీ
అప్పుల ఊబిలో చిక్కుకుని, అనేక కష్టాలు అనుభవిస్తున్న 28 మంది పేద రైతులకు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అతని సొంత నియోజకవర్గమైన సుల్తాన్ పూర్ లోని లంభువా బ్లాక్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఉచిత ఇళ్లు పొందడానికి మూడు నిబంధనలు ఆయన పరిగణనలోకి తీసుకున్నారు. అవేంటంటే, పంట రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడం, పంటను పూర్తిగా నష్టపోవడం, ఎలాంటి ఆస్తులు లేకపోవడం. ఈ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఖర్చును ఆయన తన వ్యక్తిగత నిధుల నుంచి వెచ్చించారు. అంతేకాకుండా, స్థానికుల నుంచి విరాళాల రూపంలో కొంత సేకరించారు. ఈ సందర్భంగా వరుణ్ గాంధీ మాట్లాడుతూ, చిన్న చిన్న విరాళాలతో పెద్ద కార్యక్రమాలు ఎలా చేపట్టవచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమానికీ, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు అని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని వెల్లడించారు.