: కోహ్లీ ముద్దుపేరు ‘చీకూ’ వెనుక కథ ఇదీ!
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ముద్దు పేరు ‘చీకూ’ (సపోట పండు). అయితే, చాలాకొద్ది మందికి మాత్రమే ఈ ముద్దుపేరు తెలుసు. కానీ, దాని వెనుక కథ ఎంతమందికి తెలుసో, తెలియదో కానీ, క్రీడా విలేకరి విజయ్ లోకపల్లి రాసిన ‘డ్రైవెన్’ పుస్తకం ద్వారా మాత్రం ఈ విషయం అభిమానులకి తెలిసిపోయింది. కోహ్లికి చీకూ అనే ముద్దుపేరు రావడానికి వెనుక గల ఒక సంఘటనను ఆయన తన పుస్తకంలో ఈ విధంగా వివరించారు.. ఢిల్లీ జట్టు ముంబయిలో రంజీ మ్యాచ్ ఆడుతోంది. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రజత్ భాటియా, మిథున్ మన్హాస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఆ జట్టులో ఉండేవాళ్లు. అయితే, విరాట్ కు పది ఫస్ట్ క్లాసు మ్యాచ్ లు ఆడిన అనుభవం కూడా అప్పటికి లేదు. సీనియర్ ఆటగాళ్లున్న జట్టులో తాను ఉన్నందుకు కోహ్లీ బాగా సంతోషించేవాడు. క్రీడాకారులున్న హోటల్ పక్కనే ఒక ఫ్యాన్సీ హెయిర్ స్టైల్ సెలూన్ ఒకటి ఉండేది. ఓ రోజు ఆ సెలూన్ లో తన హెయిర్ స్టైల్ ను అందంగా కట్ చేయించుకున్న కోహ్లీ హోటల్ కి వచ్చాడు. ‘ఎలా ఉన్నానంటూ’ తన సహచర ఆటగాళ్లను అడిగాడు. అదే సమయంలో, కొంచెం దూరం నుంచి చూస్తున్న సహాయక కోచ్ అజిత్ చౌదరి ‘చీకూ’లా ఉన్నావని అన్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ‘చీకూ’పై కోహ్లీ కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఆ పేరు స్థిరపడిపోయిందట. కాగా, డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లిని ఇదే ముద్దు పేరుతో ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పిలుస్తాడట.