: సీఎం చంద్రబాబు రైతులతో శభాష్ అనిపించుకున్నారు: గాలి ముద్దుకృష్ణమ నాయుడు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన... కరవు నివారిస్తామని కాంగ్రెస్ హయాంలో మేఘమథనం అంటూ ఎంతో హడావుడి చేశారని ఆయన అన్నారు. ఆ సమయంలో జగన్ ఎంతో డబ్బు కాజేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పనికి మాలిన విత్తనాలు ఇచ్చి డబ్బులు తినేశారని అన్నారు. జగన్ తన కుటుంబ సభ్యులకు యూరియా బ్లాక్ లో అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. రైతుల గురించి పట్టించుకోని వారు ఇప్పుడు రైతుల సంక్షేమం అంటూ తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. నాడు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, అయినప్పటికీ రైతులను ఆదుకోలేదని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఇన్‌పుట్ సబ్సిడీ స్కీముతో రైతులకు ఎంతో లాభం చేకూరుస్తున్నారని ఆయన చెప్పారు. రైతులతో శభాష్ అని పించుకున్నారని అన్నారు. తాము 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు. వైసీపీ, కాంగ్రెస్ రెండు కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ హయాంలో నేతలు రైతులను పట్టించుకోకుండా దద్దమ్మల్లా వ్యవహరించారని వ్యాఖ్యానించారు.