: అమెరికాలోని కేంబ్రిడ్జి స్కూల్ గ్లోబల్ టాపర్లుగా 41 మంది భారత విద్యార్థులు
అమెరికాలోని కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహించిన పరీక్షల్లో 41 మంది భారత విద్యార్థులు గ్లోబల్ టాపర్లుగా నిలిచి దేశ కీర్తిపతాకాన్ని వినువీధుల్లో సగర్వంగా ఎగురవేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థుల్లో 9 మంది ఢిల్లీకి చెందినవారు కావడం గమనార్హం. కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్(సీఐఈ) ప్రకారం.. విద్యలో అసాధారణ విజయం సాధించినట్టు వారిని గుర్తించి, ‘ఔట్ స్టాండింగ్ కేంబ్రిడ్జి లెర్నర్ సర్టిఫికెట్’ ప్రదానం చేస్తారు. గ్లోబల్ టాపర్లుగా నిలిచిన విద్యార్థుల వెనక ఉన్న ఉపాధ్యాయుల అంకితభావం, నిబద్ధతకు విద్యార్థుల విజయం చక్కని నిదర్శనమని సీఐఈ దక్షిణాసియా రీజనల్ డైరెక్టర్ రుచిరా ఘోష్ పేర్కొన్నారు. నవంబరు 2015, మార్చి 2016, జూన్ 2016లో నిర్వహించిన ఎగ్జామినేషన్ సిరీస్‌లో 41 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్టు ఆయన తెలిపారు.