: నిజాయతీగా వ్యవహరించిన దేవాలయ మహిళా అధికారిపై కత్తితో యువకుడి దాడి.. కర్ణాటకలో ఘోరం


నిజాయతీగా వ్యవహరించిన ఓ దేవాలయ మహిళా అధికారిపై యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్పందించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అతడి బారి నుంచి ఆమెను రక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ప్రస్తుతం కోమాలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని కోటిలింగేశ్వర దేవాలయ పాలనాధికారిగా కుమారి పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె కమ్మసంద్ర గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సభ్యుడు వెంకటేశప్ప ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో రూ.5 లక్షలతో వివిధ నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి నాణ్యంగా లేకపోవడంతో కుమారి బిల్లులు ఆపేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మిస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. కాగా ఇటీవల వెంకటేశప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. కుమారి ఇటీవల కోటిలింగేశ్వర ఆలయ అధికారిగా నియమితులయ్యారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలకు ప్రభుత్వ అనుమతి లేదని, అధిక ధరలతో భక్తులను ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు రావడంతో కుమారి ఆ దుకాణాలను ఖాళీ చేయించారు. ఆమె ఖాళీ చేయించిన వాటిలో వెంకటేశప్ప కుమారుడైన సంతోష్‌ది కూడా ఉంది. తన తండ్రి మరణానికి కుమారినే కారణమని అప్పటికే ఆగ్రహంతో ఉన్న సంతోష్.. ఇప్పుడు తన దుకాణాన్ని కూడా ఖాళీ చేయించడంతో తట్టుకోలేకపోయాడు. సోమవారం ఆమె ఆలయ అర్చకుడితో మాట్లాడుతున్న సమయంలో పొడవాటి కత్తితో వెనకనుంచి వచ్చి దాడిచేశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడున్నవారు రక్షించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కుమారి కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు తెలిపారు. దాడి దృశ్యాలు ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి సంతోష్‌ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News