: దేశంలోని రాజకీయ హత్యలు, దాడుల్లో 50 శాతం కేరళలోనే జరుగుతున్నాయి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీకి చెందిన ఓ కార్యకర్తను పలువురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి ఘటనలపై తెలంగాణ బీజేపీ నేతలు ఈ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో కమ్యూనిస్టుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని, తమ పార్టీ కార్యకర్తలపై వారే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కమ్యూనిస్టులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తల ఎదుగుదలను జీర్ణించుకోలేకే వారిని భౌతికంగా నిర్మూలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయ హత్యలు, దాడుల్లో 50 శాతం కేరళలోనే జరుగుతున్నాయని అన్నారు. హత్యారాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని లక్ష్మణ్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ మనకోసం పుట్టింది కాదని బీజేపీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. హత్యారాజకీయాలను అంతమొందించే వరకు బీజేపీ రాజీపడబోదని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులది కనుమరుగు అవుతున్న పార్టీ అని ఆయన పేర్కొన్నారు. హత్యల ద్వారా రాజకీయాల్లో ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని అన్నారు. ఇటువంటి పనులు చేస్తూ విజయం సాధించాలనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు.