: 'గోదారి గట్టోళ్ళు.. గట్సున్న గొప్పోళ్ళు' పుస్తకం చూశాకే నిజం తెలిసింది: దాసరి నారాయణరావు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ఇంత మంది వ్యక్తులున్నారని తనకు ఇంత వరకూ తెలియనే తెలియదని దర్శకరత్న దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పరిశ్రమలోకి వచ్చిన వారిపై గుంటూరు జిల్లాకు చెందిన బీఎస్ జగదీశ్ చేసిన పరిశోధనాత్మక రచన 'గోదారి గట్టోళ్లు... గట్సున్న గొప్పోళ్లు' పుస్తకాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించిన అనంతరం దాసరి ప్రసంగించారు. సినీ ప్రముఖులపై ఇటువంటి రచనలు రావడం అభినందించదగ్గ విషయమన్న ఆయన, గోదావరి తీరం నుంచి వచ్చిన వారిపై పుస్తకం చూశాకే తనకు నిజం తెలిసిందని, జగదీశ్ మంచి ప్రయత్నం చేశారని కితాబిచ్చారు. కాగా, పోలీసు శాఖలో పనిచేస్తున్న జగదీశ్ ప్రస్తుతం రాజమండ్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.