: విఫలమైన ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగ పరీక్ష


ఉత్తరకొరియా నిర్వహించిన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి పరీక్ష విఫలమైంది. ఉత్తర ప్యాంగాన్ ప్రావిన్స్‌ లో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించినట్టు, అది విఫలమైనట్టు అమెరికా స్ట్రాటజిక్ కమాండ్ సిస్టమ్ గుర్తించింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన చేసింది. 'ది ముసుడాన్' పేరుతో ఖండాంతర క్షిపణిని అమెరికా ఉత్తర ప్రాంతంతో పాటు జపాన్, దక్షిణ కొరియాల్లోని లక్ష్యాలను ఛేదించే లక్ష్యంతో ఉత్తర కొరియా రూపొందించిందని పెంటగాన్ అభిప్రాయపడింది. దీనిని సరిగ్గా శనివారం మధ్యాహ్నం 12.33 గంటలకు ప్రయోగించింది. అయితే ఈ క్షిపణి పూర్తిగా విఫలమైందని పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ఉత్తర కొరియా జరిపిన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి పరీక్షలను తీవ్రంగా ఖండిస్తున్నామని పెంటగాన్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను బేఖాతరు చేయడం కిందకి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు వస్తాయని పెంటగాన్ ప్రతినిధి గారీ రోస్ తెలిపారు. ఈ క్షిపణి పరీక్షలతో అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్న ఆయన, కొరియా రిపబ్లిక్, జపాన్‌ సహా మిత్రదేశాల రక్షణకు అమెరికా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిపై ఉత్తరకొరియా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం విశేషం. సాధారణంగా క్షిపణి పరీక్షను బాహ్య ప్రపంచానికి ఘనంగా వెల్లడించే ఉత్తరకొరియా మౌనంగా ఉండడంతో ఈ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టేనని అనుమానం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News