: క్వాలిటీ ఆహారంపై పెరిగిన భారతీయుల శ్రద్ధ... కూరగాయల కోసం ఆన్ లైన్లో కాస్ట్ లీ షాపింగ్!


ఆన్ లైన్లో టీవీలు, మొబైల్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉండవచ్చు. వీటిపై ఆకర్షితులవుతున్న వారి సంఖ్యా తక్కువేమీ కాదు. ఇదే సమయంలో తమ ఆరోగ్యంపై శ్రద్ధను పెంచుకుంటూ, క్వాలిటీతో కూడిన ఆహార పదార్ధాల కోసం ఆన్ లైన్ ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలను మార్కెట్ల కన్నా అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. వేగవంతమైన డెలివరీ, సేంద్రీయ పద్ధతుల్లో పెరిగిన రసాయన రహిత ఉత్పత్తులు ఆన్ లైన్ వ్యాపారాన్ని మరింతగా పెంచుతున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. "సాధ్యమైనంత సులువుగా ఆన్ లైన్ షాపింగ్ నిర్వహించుకునే వెసులు బాటు కల్పిస్తున్నాం. కూరగాయలు, పండ్లు తాజాదనాన్ని ఎంతమాత్రమూ కోల్పోకుండా ప్యాకింగ్ చేసి, ఆర్డర్ ఇచ్చిన తరువాత సాధ్యమైనంత త్వరగా కస్టమర్ కు అందిస్తున్నాం. అందువల్లే మా వ్యాపారంలో 70 శాతం పండ్లు, కూరగాయల విక్రయాలే ఆక్రమించాయి" అని బిగ్ బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు హరీ మీనన్ వ్యాఖ్యానించారు. గడచిన ఏడాది కాలంలో ఇ-గ్రోసర్ వ్యాపారంలో తాజా కూరగాయల వ్యాపారం శరవేగంగా పెరుగుతూ వచ్చిందని వివరించారు. "ఈ విధానంలో కూరగాయలను, పండ్లను చూడకుండా, చేతితో తాకకుండా కస్టమర్ కొనుగోలు చేస్తున్నాడంటే, మా సంస్థపై ఉన్న నమ్మకమే కారణం. ఒకవేళ కస్టమర్ కు ఈ ఉత్పత్తులు నచ్చకుంటే ఒక్క ప్రశ్న కూడా వేయకుండా వెనక్కు తీసుకుంటున్నాం. మా విజయ రహస్యమిదే" అని గ్రోఫర్ వ్యవస్థాపకుడు అల్బీందర్ ధిండాసా వెల్లడించారు. గ్రోఫర్స్ సంస్థకు సంబంధించినంత వరకూ తాజా కూరగాయల వ్యాపారం శరవేగంగా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. నవంబర్ నుంచి వివిధ రకాల కూరగాయల పంట చేతికి అందనుండటం, ధరలు కూడా తగ్గే పరిస్థితి ఉండటంతో, మరింత మార్కెట్ వాటాను నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. ఇక ఈ సంస్థలు రైతులతో డైరెక్టుగా డీల్స్ కుదుర్చుకుని, వారి పంటను తొలిరోజు నుంచే పర్యవేక్షిస్తున్నాయి. సాధ్యమైనంత తక్కువ రసాయనాలు వాడేలా చూడటం, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, పెట్టుబడులకు కొరత లేకుండా చూడటం వంటి వాటితో కూరగాయల వ్యాపారంలో ఉన్న రైతులకూ మేలు కలుగుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News