: 26 ఏళ్ల క్రితం రహస్యంగా ఇండియాకు వచ్చి వెళ్లిన నోబెల్ విజేత బాబ్ డైలాన్
ఈ ఏటి నోబెల్ బహుమతి విజేత ప్రఖ్యాత అమెరికన్ సింగర్ బాబ్ డైలాన్ తన జీవితంలో ఒకే ఒక్కసారి ఇండియాకు వచ్చారు. 1990 సంవత్సరంలో ఆయన కోల్ కతాలో జరిగిన ఓ వివాహానికి రహస్యంగా హాజరయ్యారు. బెంగాలీ సంగీత విధ్వాంసుడు, గాయకుడు పూర్ణా దాస్ బాల్ కుమారుడి పెళ్లికి వచ్చిన ఆయన ఢాకూరియా ప్రాంతంలోని ఇరుకు వీధుల్లో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో బస చేశారు. అంతకు ముందు అమెరికాలో జరిగిన వుడ్ స్టాక్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు పూర్ణా దాస్ వెళ్లిన వేళ, డైలాన్ తో కలసి ఒకే గదిని పంచుకున్నారు. ఆ పరిచయంతో కుమారుడి వివాహానికి ఆహ్వానించగా, ఇండియాకు వచ్చి వెళ్లారు. తాజాగా ఆయనకు నోబెల్ బహుమతి రావడంతో, నాటి ఘటనలను గుర్తు చేసుకున్న దాస్, "బాబ్ డైలాన్ గురించి ఒక్క మాటలో చెప్పలేం. ఆయన గొప్ప వ్యక్తి. నిజమైన కళాకారుడు. నాడు ఆయన ఓ స్నేహితుడిగా ఇండియాకు వచ్చారు. అప్పటికే ఆయన ఎంతో ఫేమస్. ఆయన పర్యటనను రహస్యంగా ఉంచాలని అనుకున్నాం. బాబ్ మా ఇంట్లో ఓ రెండు గంటలున్నారు. ఆయన రాకను గురించి తెలుసుకున్న పత్రికల వాళ్లు, ఇతర నగరాల నుంచి అభిమానులు ఫోన్ కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతుండటంతో ఆయన వెంటనే వెళ్లిపోయారు" అని తెలిపారు.