: నిబంధనలు పాటించలేదు... పోలీసులతో సమస్య పరిష్కారం కాదు కదా?: పవన్ కల్యాణ్
ఆక్వాఫుడ్ పరిశ్రమ నిబంధనలు పాటించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలకు తాను సమస్యను వివరిస్తానని అన్నారు. సమస్యలు పోలీసులతో పరిష్కారం కావు సరికదా, మరింత జటిలమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అలా కాదని పోలీసులతోనే సమస్య పరిష్కారమవుతుందనుకుంటే ప్రజాస్వామ్యంలో అంతకంటే పెద్ద తప్పు మరోటి ఉండదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కనీసం ఒక కమిటీ వేసి, ప్రజా సమస్యలు వినడం ద్వారా సమస్యను ఓ కొలిక్కి తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే తాము కోర్టు కెళ్లి సమస్యపై కమిటీ వేసేలా చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఉద్యమం ముగిసిపోలేదని ఆయన తెలిపారు. తాము పార్టీ క్యాంపు ఆఫీస్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పార్టీ నిర్మాణం జరుగుతోందని ఆయన తెలిపారు.