: ఆంధ్రా ట్రంప్ చంద్రబాబు... ముద్రగడ యాత్రకు వైసీపీ మద్దతిస్తుంది: భూమన


కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపడుతున్న సత్యాగ్రహ యాత్రకు వైసీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. కాపుల తరహాలో ప్రతి ఒక్కరు ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని, ఉద్యమం చేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. సర్కారుపై దండయాత్రకు సమయం ఆసన్నమైందని అన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి సుప్రీంకోర్టు నిర్ణయం అడ్డంకిగా మారిందని ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని... తెలంగాణలో అడ్డురాని నిబంధనలు ఏపీలోనే వస్తున్నాయా? అని భూమన ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. హామీలను నెరవేర్చని చంద్రబాబుపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ట్రంప్ కు, చంద్రబాబుకు దగ్గర పోలికలున్నాయని భూమన అన్నారు. ఆంధ్రా ట్రంప్ చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News