: జయలలిత ఆరోగ్యంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బ్యాంకు ఉద్యోగులను పోలీసులకు పట్టించిన మహిళ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి అన్నాడీఎంకే నేతలు ట్విట్టర్ ద్వారా ప్రచారం ప్రారంభించినప్పటికీ, పలువురు ఆమె ఆరోగ్యంపై సోషల్ మీడియా ద్వారా, మౌఖికంగా వదంతులు వ్యాపింపజేస్తున్నారు. తాజాగా, జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిరువురిని కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరులోని ఓ బ్యాంకుకు చెందిన ఉద్యోగులుగా పోలీసులు పేర్కొన్నారు. స్వయం సహాయక మహిళా బృందాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పునిదాదేవి (37) అనే మహిళ ఇటీవల బ్యాంకుకు వెళ్లింది. అయితే, ఆ సమయంలో అందులో ఉద్యోగం చేస్తోన్న సురేష్, రమేష్‌లు జయలలితపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో పునిదాదేవి ‘అమ్మ’కు ఏమయిందోనని ఆందోళన చెందింది. ఇంటికి వెళ్లిన తరువాత ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలు నిజమేనా? అంటూ ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసింది. జయలలిత ఆసుపత్రిలో క్షేమంగా ఉన్నారని వారు చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి బ్యాంకుకు సెలవులు రావడంతో పునిదాదేవి బ్యాంకుకు వెళ్లలేకపోయింది. అయితే, తాజాగా మళ్లీ బ్యాంకుకు వెళ్లిన పునిదాదేవి ఆ ఇద్దరు ఉద్యోగులను నిలదీసింది. వారు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బ్యాంకు ఉద్యోగులు ససేమిరా అనడంతో తొండాముత్తూర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో వారిరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇదే అంశంపై అరెస్టు చేశారు.