: మా కార్లకు లేని ఇబ్బంది నీకేంటి?.. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కార్ ఆగ్రహం
జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుమతిగా ఇచ్చిన కారును తిరిగి ఇచ్చేస్తానంటూ సంచలన ప్రకటన చేసిన దీపాపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలని సూచించింది. త్రిపుర రహదారులు ఖరీదైన కార్లు తిరిగేందుకు అనువుగా లేవని, ఇక్కడ సర్వీస్ సెంటర్లు కూడా లేకపోవడంతో తనకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వెనక్కి ఇచ్చేయనున్నట్టు దీప ప్రకటించిన సంగతి తెలిసిందే. కారు తీసుకుని దాని విలువకు తగిన మొత్తాన్ని ఇవ్వాలని దీప కోరింది. ఆమె ప్రకటనపై ప్రభుత్వం స్పందించింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర విదేశీ ప్రముఖుల కార్లు తిరుగుతున్నాయని, వాటికి లేని ఇబ్బంది ఆమెకు ఎలా వచ్చిందని మంత్రి బాదల్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మరో మంత్రి మాణిక్ దేవ్ అన్నారు.