: షాహిద్ అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ బెదిరింపు.. మియాందాద్‌పై నోరు పారేసుకుంటే బాగుండదని హెచ్చరిక


పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హెచ్చరికలు జారీ చేశాడు. మాజీ క్రికెటర్ మియాందాద్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే బాగుండదని బెదిరించాడు. గతకొన్ని రోజులుగా అఫ్రిది, మియాందాద్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 12న అఫ్రిదికి ఫోన్ చేసిన దావూద్.. మియాందాద్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆపాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అఫ్రిది ‘మ్యాచ్ ఫిక్సర్’ అని మియాందాద్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. మియాందాద్‌ ఆరోపణలను ఖండించిన అఫ్రిది అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. పాకిస్థాన్ క్రికెట్‌లో ఇది పెను సంచలనమైంది. అఫ్రిది, మియాందాద్ ఇద్దరూ తనకు ఎంతో కావాల్సిన వారిని, వివాదానికి ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని మాజీ క్రికెటర్ వాసిం అక్రమ్ సూచించాడు. వారిద్దరి మధ్య జరిగిన వివాదం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. కాగా మియాందాద్ తనకు వియ్యంకుడు కావడంతోనే దావూద్.. అఫ్రిదిని బెదిరించాడని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News