: సంపాదనలో ఇప్పటికీ పాప్ రారాజు మైఖేల్‌ జాక్సనే టాప్!

పాప్ రారాజు మైఖేల్‌ జాక్సన్ బతికుండగానే కాదు, మరణించి ఇన్నేళ్లైనా కూడా సంపాదనలో ఏమాత్రం వెనుకబడకపోవడం విశేషం. అందుకే, మరణానంతరం కూడా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో అత్యధిక సంపాదనా పరుడిగా నిలిచి వార్తల్లో వ్యక్తయ్యాడు. ప్రఖ్యాత ఫోర్బ్స్‌ పత్రిక ‘టాప్‌ ఎర్నింగ్‌ డెడ్‌ సెలబ్రిటీ’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వరుసగా నాలుగో ఏడాది కూడా మైకేల్ జాక్సన్ టాపర్‌ గా నిలవడం విశేషం అని ఫోర్బ్స్‌ ప్రకటించింది. 825 మిలియన్ డాలర్ల ఆదాయంతో మైకేల్‌ అగ్రస్థానంలో నిలవగా, ఈ ఏడాది మరణించిన సంగీత విద్వాంసుడు డేవిడ్‌ బోవీ ద్వితీయ స్థానంలో నిలిచాడు. మైకేల్ జాక్సన్ ఎస్టేట్‌ను విక్రయించడం ద్వారా 750 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా, మిగతా సొమ్ము ఆయన మ్యూజిక్‌ ఆల్బమ్‌ హక్కులను సొంతం చేసుకున్న సోనీ, ఏటీవీ సంస్థల నుంచి రాయల్టీ ద్వారా సమకూరినట్టు ఫోర్బ్స్‌ వెల్లడించింది. ఆదాయపన్ను, ఇతర న్యాయ ఖర్చుల చెల్లింపునకు ముందే జాక్సన్ ఆదాయాన్ని లెక్కగట్టామని, వీటన్నింటిని మినహాయిస్తే ఆయన ఆదాయం కొంతమేర తగ్గవచ్చని, అయినప్పటికీ ఆయన టాప్ ర్యాంకులో ఎలాంటి మార్పు చోటుచేసుకోదని ఫోర్బ్స్ తెలిపింది. మిగిలిన వారితో పోలిస్తే జాక్సన్ సంపాదన చాలా ఎక్కువని ఫోర్బ్స్‌ వెల్లడించింది.

More Telugu News