: గుజరాత్ లో కేజ్రీవాల్ ను తీవ్రవాదులతో పోలుస్తూ వెలసిన పోస్టర్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను తీవ్రవాదిగా పోలుస్తూ గుజరాత్ లో వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ అక్టోబర్ 16న (ఆదివారం) గుజరాత్ లోని సూరత్ లో భారీ ర్యాలీ నిర్వహించనుంది. అనంతరం యోగి చౌక్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ నేపధ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించే బీజేపీ వివాదాస్పద పోస్టర్లు ఏర్పాటు చేయించిందని ఆప్ ఆరోపిస్తోంది. సూరత్ లో వెలసిన పోస్టర్లలో బుర్హాన్ వనీ, కేజ్రీవాల్, ఒసామా బిన్ లాడెన్, మసూద్ అజహర్ ల ఫోటోలతో పాటు వారిని పాకిస్థాన్ హీరోలంటూ పేర్కొన్నారు. దీంతో బీజేపీ చీప్ ట్రిక్స్ ను ప్రయోగిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.