: మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్‌టెల్
టెలికం రంగంలో రిలయన్స్ జియో సిమ్‌ల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ఆ సిమ్ కార్డులు అమ్ముడు పోవడంతో మిగిలిన టెలికం కంపెనీలు పోటీని తట్టుకొని నిలబడడానికి పోటాపోటీగా వినియోగదారులకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో ఆఫర్లను ప్రకటించిన ఆసియాలోనే అతిపెద్ద టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా మరోసారి తమ వినియోగదారుల ముందుకు పలు ఆఫర్లు తెచ్చింది. మూడు నెలల పాటు అన్‌లిమిటెడ్ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్‌ను మొదట ప్రీపెయిడ్ కస్టమర్లకు అందించి, ఈ తరువాత పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కూడా అందించాలని యోచిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందాలంటే వినియోగదారులు ఎయిర్‌టెల్ క్లౌడ్, ఎయిర్‌టెల్ డైలర్ అనే రెండు యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. కస్టమర్లు ఎయిర్‌టెల్ క్లౌడ్ డౌన్ లోడ్ తో 2 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్, బ్యాకప్ కూడా పొందవచ్చని చెప్పింది. అంతేకాదు, ఎయిర్‌టెల్ డైలర్ ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి 50 నిమిషాల పాటు ఉచిత కాల్ చేసుకోవచ్చని పేర్కొంది.