: చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదు.. ట్రీట్ మెంట్ చేయిస్తే బాగుంటుంది: రోజా
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో పుట్టినందుకు సిగ్గుపడాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ‘మురికివాడలో ఉంటే మురికి ఆలోచనలు వస్తాయని చంద్రబాబు అన్నారు. అంటే పేదలు మనుషులు కాదా? చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబుకి ట్రీట్ మెంట్ చేయిస్తే బాగుంటుంది. ప్రపంచంలో ఎన్నో కట్టడాలను ఓపక్క ఇండియన్లు కడుతోంటే, మరోపక్క ఈయన సింగపూర్ కంపెనీలకు ఆ బాధ్యత ఇవ్వడం ఎందుకు? మోసపూరిత మాటలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారు’ అని రోజా వ్యాఖ్యానించారు. ‘ఆడవాళ్లంటే చంద్రబాబుకి చులకన.. మహిళలకు అబద్ధాలు చెప్పి వారి సంక్షేమం అంటూ మోసం చేయాలని అనుకుంటున్నారు. కానీ, మహిళలను గౌరవించాలన్న మర్యాద చంద్రబాబుకి లేదు. ఆయనను ఏపీ నుంచి తరిమేయాలి. మరోవైపు నల్లధనం గురించి చంద్రబాబు ఆయన మంత్రులు ఏవోవో మాట్లాడుతున్నారు. నల్లధనం అంశం గురించి కేంద్ర ప్రభుత్వానికి, వాటిని ఇచ్చిన వారికి మాత్రమే తెలుసు. చంద్రబాబు ఆ విషయం చెప్పారంటే, అది బాబు డబ్బయినా ఉండాలి. లేకపోతే ఆయన బినామీ డబ్బయినా అయి ఉండవచ్చు. అవినీతి పరుడయిన చంద్రబాబు నల్లధనంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది’ అని రోజా వ్యాఖ్యానించారు.