: ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు.. గూండా సర్కార్ రాజ్యమేలుతోంది: సీపీఎం నాయకురాలు బృందాకారత్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లాఠీలు, తుపాకులు ప్రయోగించే గూండా సర్కారు రాజ్యమేలుతోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం మండలం తుందుర్రులో మెగా ఆక్వాఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ గురువారం భీమవరం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందా కారత్ మాట్లాడుతూ ఏపీలో ప్రస్తుతం ప్రజాభీష్టానికి అనుగుణంగా పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తుందుర్రులో ఫుడ్‌పార్క్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఫుడ్ కోర్టు నిర్మాణానికి అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అందరూ కలిసికట్టుగా పోరాడి చంద్రబాబుతో కన్నీళ్లు తెప్పించాలని పిలుపునిచ్చారు.