: తండ్రితో ఆడుతూ.. అంతలోనే ప్రాణాలు కోల్పోయిన బాలుడు!
అంతవరకూ కన్నతండ్రితో కలిసి సూపర్ మార్కెట్లో సందడి చేసిన బాలుడు, అంతలోనే ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన చైనాలోని గ్వాంగ్ ఝౌలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సుమారు నాలుగేళ్ల వయసున్న ఓ బాలుడు తన తండ్రితో కలిసి సూపర్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ చిన్నారి తన తండ్రి చేతుల్లో చేతులు పెట్టి, అతని వెనకాలే నడుస్తు కొంతసేపు మార్కెట్లో తిరిగాడు. ఇలా ఓ విభాగం నుంచి ఇంకో విభాగంలోకి వెళ్లే క్రమంలో ఫ్లోర్ బాగా సున్నితంగా ఉండడంతో వెనుక నడుస్తున్న కుమారుడి కాళ్లు తండ్రికి తగిలాయి. దీంతో ఊహించని విధంగా ఆ తండ్రి వెనక్కి పడిపోయాడు. దీంతో ఆ బాబు తండ్రి కింద పడిపోయాడు. వెనకాలే ఉన్న చిన్నారిపై ఒక్కసారిగా అమాంతం బరువు పడిపోవడంతో కనురెప్ప మూసి తెరిచేంతలో ఘోరం జరిగిపోయింది. పడిపోయిన తండ్రి అమ్మో అనుకుంటూ లేచేలోపు, పక్కనే ఉన్న సేల్స్ ఉమన్ వారికి సహాయం చేసింది. లేచి చూసిన తండ్రి చలనంలేని బాబును ఆసుపత్రిలో చేర్చగా, అప్పటికే ఆ చిన్నారి మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు. అమాంతం పెద్ద బరువు మీద పడిపోవడంతో ఆ బాలుడికి సర్వికల్ ఫ్రాక్చర్ అయి ఉండొచ్చునని వారు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాలు సూపర్ మార్కెట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డుకాగా, వాటిని సోషల్ మీడియా సైట్ లో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలంటూ నెటిజన్లు వీటిని షేర్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూడండి... బయటకు వెళ్లినప్పుడు పిల్లలతో జాగ్రత్తగా ఉండండి.