: బుల్స్ మెడలు వంచిన బేర్స్... 440 పాయింట్ల భారీ నష్టం... రూ. 1.63 లక్షల కోట్లు హారతి కర్పూరం
అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న ఆందోళనల నుంచి, ఇండియాలో ఐటీ రంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందని వచ్చిన విశ్లేషణల వరకూ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించిన వేళ, సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. దసరా, మొహర్రం సందర్భంగా రెండు రోజుల సెలవు అనంతరం తిరిగి తెరచుకున్న మార్కెట్స్, గురువారం నాడు సెషన్ ఆరంభంలోనే అమ్మకాల ఒత్తిడి వెల్లువెత్తగా, ఆపై పతనం కొనసాగింది. మరే దశలోనూ సూచికలకు కొనుగోలు మద్దతు కనిపించకపోగా, నిఫ్టీ అత్యంత కీలకమైన మద్దతు స్థాయుల వద్ద కుదురుకోలేక డీలా పడింది. దీంతో సెషన్ ఆసాంతం బేర్స్ హవా నడిచింది. చైనాలో వృద్ధి మందగించిందని వచ్చిన వార్తలు, పార్టిసిపేటరీ నోట్ పెట్టుబడులను తగ్గించేలా ఇండియా నిర్ణయం తీసుకోనుందని వచ్చిన ఊహాగానాలు సైతం మార్కెట్ ను దెబ్బతీశాయి. దీంతో సోమవారం నాటి సెషన్లో రూ. 1,13,49,915 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, గురువారం నాడు రూ. 1,11,86,390 కోట్లకు తగ్గగా, సుమారు రూ. 1,63,525 కోట్ల మేరకు ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 439.23 పాయింట్లు పడిపోయి 1.56 శాతం నష్టంతో 27,643.11 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 135.45 పాయింట్లు పడిపోయి 1.56 శాతం నష్టంతో 8,573.35 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.50 శాతం, స్మాల్ కాప్ 1.41 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 11 కంపెనీలు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, సిప్లా, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, ఐడియా, అరవిందో ఫార్మా, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,980 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 942 కంపెనీలు లాభాలను, 1,920 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. తదుపరి సెషన్లలో సైతం భారత స్టాక్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.