: బార్ గర్ల్స్ పై కోట్లకు కోట్లు, ఆపై డ్రగ్స్... జల్సా చేసిన ముంబై కాల్ సెంటర్ స్కాం నిందితులు
23 ఏళ్ల యువకుడు షాగ్గీ నేతృత్వంలో అమెరికన్లను పన్ను ఉచ్చులో బిగించి దాదాపు రూ. 500 కోట్లను నొక్కేసిన ముంబై కాల్ సెంటర్ స్కామ్ లో అంత ధనాన్ని ఎలా ఖర్చు పెట్టారన్న విషయాన్ని విచారించిన పోలీసులు విస్తు పోయే అంశాలను కనుగొన్నారు. ఈ కేసులో షాగ్గీతో పాటు 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, డబ్బులో అత్యధిక మొత్తాన్ని బార్ గర్ల్స్ పై ఖర్చు పెట్టారని, ఆపై రాత్రుళ్లు డ్రగ్స్ తీసుకుంటే ఉత్సాహంతో పనిచేయవచ్చన్న కోణంలో ఆలోచించి ఆ విధంగా ఖర్చు చేశారని తేల్చారు. ఈ సెంటర్లలో పనిచేస్తున్న వారిలో అత్యధిక ఉద్యోగులు తమ జీతాలు, ప్రోత్సాహకాలను ఎలా ఖర్చు పెట్టారన్న అంశంపై విచారించి, ఎంజాయ్ కోసం అమ్మాయిల మీదే అధికంగా వెచ్చించారని థానే క్రైమ్ బ్రాంచ్ అధికారులు చెబుతున్నారు. ఇక తమ బిడ్డలు ఓ మంచి కంపెనీలో పనిచేస్తూ, ఆరంకెల జీతం అందుకుంటున్నారని సంబరపడుతున్న పలువురి తల్లిదండ్రులు, వారు అక్కడ చేసిన నిర్వాకాలు, మోసం గురించి తెలుసుకుని తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ కొడుకు ఇలా డ్రగ్స్ కు బానిసై ఘరానా మోసాలు చేస్తున్నాడని ఎంతమాత్రమూ ఊహించలేదని ఓ నిందితుడి తండ్రి వాపోయాడు. కాగా, అరెస్టయిన నిందితులందరినీ తదుపరి విచారణ నిమిత్తం పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో షాగ్గీ వెనకెవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాఫ్తు సాగుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.