: భారీ యుద్ధవాహకనౌకతో భారత్ ను భయపెడుతున్న చైనా!


చైనా సోషల్ మీడియా వైబోలో ఈ మధ్య కాలంలో హల్ చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు భారత్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ దీవి సైజులో ఉండే భారీ యుద్ధ వాహక నౌకను చైనా తయారు చేస్తోంది. తూర్పు బీజింగ్‌ దగ్గర్లోని డాలియన్‌ ఓడరేవు పట్టణంలో డ్రై డాక్‌ యార్డ్‌ వద్ద టైప్‌ 001-ఏ యుద్ధ వాహకనౌకను చైనా నిర్మిస్తోంది. దీని బరువు 60 వేల టన్నుల వరకు ఉంటుందని అంచనా. దీని ద్వారా 50 యుద్ధ విమానాలను ఒకేసారి తరలించవచ్చు. రష్యా ఎస్‌యూ-27 అనుగుణంగా చైనా రూపొందించిన 36..జే-15 ఫైటర్‌ విమానాలను ఇందులో తీసుకెళ్లవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయంటూ పలు ఫోటోలు బయటకు రాగా, ఇప్పుడు దీని నిర్మాణం ఇంచుమించు పూర్తయినట్టు ఫోటోలు హల్ చల్ చేయడం విశేషం. త్వరలోనే దీనికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిస్థాయిలో 2020 నాటికి చైనా నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనా రూపొందిస్తున్న రెండో దేశీయ యుద్ధనౌక ఇది. దీవి సైజులో ఉండే ఈ యుద్ధ నౌకలో వంతెనలు, యుద్ధ విమానయాన సౌకర్యాలు, యుద్ధ నియంత్రణ సాంకేతికత, ర్యాడర్లు, సెన్సర్లు ఇలా అత్యాధునిక హంగులన్నీ ఉండనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే భారత్ కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది భారత్ లక్ష్యంగా చైనా తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్ ను అడ్డుకునేందుకు పాకిస్థాన్, శ్రీలంక తదితర దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్న చైనా, బెలూచిస్థాన్ లో ఓడరేవును నిర్మించడం ద్వారా భారత్ ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే బెలూచిస్థాన్ లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఇప్పట్లో ఓడరేవు నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు లేవు. అదీ కాక బెలూచిస్థాన్ లో ఓడరేవును నిర్మించడం ద్వారా చైనాకు భారీ వ్యయం కానుంది. అలా కాకుండా, యుద్ధవాహకనౌకను తయారు చేసి అక్కడ మోహరింపజేయడం ద్వారా ఖర్చుతోపాటు, లక్ష్యం ప్రకారం భారత్ ను ఇబ్బంది పెట్టడం, పాకిస్థాన్ కు నైతిక మద్దతునివ్వడం వంటి లక్ష్యాలు ఏకకాలంలో నెరవేరే అవకాశం ఉంది. అదే సమయంలో భవిష్యత్ లో పాకిస్థాన్ తో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఈ యుద్ధ విమాన వాహకనౌకను ఇంకో చోట మోహరింపజేయవచ్చు. లేదా స్వదేశానికి రప్పించుకోవచ్చు. అదే సమయంలో జపాన్, ఫిలిప్పీన్స్, మయన్మార్ వంటి దేశాలను సులువుగా లొంగదీసుకోవచ్చని చైనా భావిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News