: పోలీసుల గ్యాంబ్లింగ్ పై మీడియాకు సమాచారం ఇచ్చాడని కానిస్టేబుల్ పై పగ సాధిస్తున్నారు!
అహ్మదాబాద్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్న గ్యాంబ్లింగ్ పై మీడియాకు సమాచారం ఇచ్చాడన్న కారణంతో ఓ కానిస్టేబుల్ పై ఉన్నతాధికారులు పగ సాధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గ్యాంబ్లింగ్ వీడియోను తీసిన రమేష్ కుమార్ బారోత్ అనే కానిస్టేబుల్ దాన్ని మీడియాకు పంపించడం, గత సంవత్సరం అహ్మదాబాద్ లో పెను సంచలనాన్నే సృష్టించింది. గత సంవత్సరం డిసెంబర్ 25న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని రూమ్ నంబర్ 20లో ఒక అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, రూమ్ ఇన్ చార్జ్ సహా ఏడుగురు పోలీసులు నిషేధిత గ్యాంబ్లింగ్ ఆట ఆడుతూ పట్టుబడ్డారు. దీనిపై వార్తలు రావడంతో వారంతా క్రమశిక్షణా చర్యలకు గురికావాల్సి వచ్చింది. కట్ చేస్తే, 9 నెలల తరువాత రమేష్ కుమార్ పై చార్జ్ షీట్ దాఖలైంది. తనకు దొరికిన సమాచారాన్ని పై అధికారులకు ఇవ్వకుండా మీడియాకు ఇచ్చాడన్న అభియోగంపై ఆయన మీద కేసు నమోదైంది. పది రోజుల్లో సంజాయిషీ ఇచ్చుకోకుంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని తెలుస్తోంది. కాగా, తనకు వీరి గ్యాంబ్లింగ్ ఆట గురించిన సమాచారం తెలియదని, ఓ ఉన్నతాధికారి వేధింపుల గురించి ఫిర్యాదు చేసినందుకే ఇలా తప్పుడు కేసులో ఇరికిస్తున్నారని రమేష్ కుమార్ ఆరోపిస్తుండగా, ఆయన సెల్ ఫోన్ కాల్ లిస్టును చూసిన తరువాత మీడియాకు ఉప్పందించింది రమేషేనని గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఘటనపై విచారణ జరిపిన అధికారి పీయుష్ పటేల్ అంటున్నారు.