: విమానంలో నీచ ప్రవర్తన... దుస్తులు విప్పేసి హంగామా
ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు నానా హంగామా సృష్టించాడు. బట్టలు విప్పేసి నీచంగా ప్రవర్తించాడు. భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత విమానం ఎక్కగానే తనకు సీటు బెల్టు పెట్టుకోవడం రాదని అనడంతో, ఎయిర్ హోస్టెస్ వచ్చి అతడికి సాయం చేసింది. అనంతరం బాత్ రూమ్ కి వెళ్లిన అతను, అక్కడ ఉన్న కాలింగ్ బెల్ నొక్కి, సిబ్బందిని పిలిచాడు. దీంతో, అక్కడకు వెళ్లిన ఎయిర్ హోస్టెస్ షాక్ అయింది. బట్టలన్నీ విప్పేసి చాలా అభ్యంతరకర పరిస్థితిలో అతను కనిపించాడు. దీంతో, లోపలకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. కాస్త గౌరవప్రదంగా వ్యవహరించాలని విమాన సిబ్బంది అతడికి చెప్పారు. ఆ తర్వాత కూడా అతడు తన ప్రవర్తన మార్చుకోలేదు. విమానం దిగేటప్పుడు కూడా మహిళా సిబ్బందిపై దుర్భాషలాడాడు. దీంతో, విమాన కెప్టెన్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశాడు. ఈ నేపథ్యంలో, సదరు ప్రయాణికుడు విమానం దిగగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.