: కస్టమర్ డబ్బు ఇవ్వలేదని చెప్పి అత్యాచారం కేసు పెడితే కుదరదు!: సెక్స్ వర్కర్లపై సుప్రీం సంచలన తీర్పు
ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారంటూ, ఓ మహిళ పెట్టిన కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ ముగ్గురూ డబ్బులు ఇవ్వలేదన్న కారణంతోనే బాధితురాలు కేసు పెట్టిందని నమ్ముతూ, సెక్స్ వర్కర్లు తమకు డబ్బులు అందలేదన్న కారణంతో అత్యాచార కేసులు పెట్టలేరని తీర్పు ఇచ్చింది. వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్పిస్తున్నామని చెప్పిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.
కేసు వివరాల్లోకి వెళితే, బెంగళూరులో పనిమనిషిగా చేసే ఓ మహిళ, రాత్రిపూట వ్యభిచారం చేస్తుంటుంది. తనను ముగ్గురు వ్యక్తులు ఆటోలో తీసుకెళ్లి పదేపదే అత్యాచారం చేశారని కేసు పెట్టింది. విచారణ జరిపిన పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టులో నిందితులకు శిక్షపడగా, వారు సుప్రీంను ఆశ్రయించారు.
కేసును విచారించిన ధర్మాసనం, మహిళ రూమ్మేట్ ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా వింది.
నిందితుల నుంచి బాధితురాలు డబ్బులు తీసుకునేదని, నిందితులు వెయ్యి రూపాయలు ఇవ్వకపోవడంతోనే కేసు పెట్టిందని, రాత్రుళ్లు ఆమె సెక్స్ వర్కర్ గా పనిచేసేదని కోర్టుకు ఆమె తెలిపింది. ఆపై కేసు పెట్టిన బాధితురాలు సైతం కోర్టు ముందు నిజం చెబుతూ, కేసు పెడితే, డబ్బిస్తారన్న తన మనసులోని ఉద్దేశాన్ని బయటపెట్టింది. దీంతో కేసును కొట్టివేస్తున్నామని ధర్మాసనం వెల్లడించింది.