: ఆ పీడకలకు రెండేళ్లు.. హుద్‌హుద్ ప్రళయాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు


హుద్ హుద్.. తెలుగు ప్రజలు ఈ పేరును ఎప్పటికీ మర్చిపోలేరు. రెండేళ్ల క్రితం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో బీభత్సం సృష్టించిన ఈ తుపాను వచ్చి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. హుద్ హుద్ ధాటికి స్టీల్ సిటీ విశాఖపట్నం చిగురుటాకులా వణికిపోయింది. సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వృక్షాలు కూకటివేళ్లతో కూలిపోయాయి. ఎన్నో తుపానులను తట్టుకుని నిలబడిన ఆంధ్రప్రదేశ్‌కు హుద్ హుద్ మాత్రం పీడకలను మిగిల్చింది. అక్టోబరు 12, 2014. ఉదయం 8-12 గంటల సమయంలో తుపాను ప్రభావంతో గంటకు 210 కిలోమీటర్ల వేగంతో విశాఖపట్నం తీరం వద్ద హుద్ హుద్ తీరం దాటింది. విశాఖలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అప్పటికి మూడు రోజుల ముందే హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. బలమైన గాలులకు చెట్లు, భవనాలు అన్న తేడా లేకుండా కుప్పకూలాయి. తుపాను బీభత్సానికి 40 మంది మృతి చెందగా, 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేటితో హుద్‌హుద్ తుపాను వచ్చి రెండేళ్లు పూర్తికావడంతో ప్రజలు ఆనాటి తుపాను విధ్వంసాన్ని, నాడు తాము ఎదుర్కొన్న పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News