: ఒత్తిడి తట్టుకునేందుకు ఉద్యోగులకు 'వింగ్ చున్' నేర్పిస్తున్న రెస్టారెంట్
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ సాధన చేసిన 'వింగ్ చున్' మార్షల్ ఆర్ట్స్ తో రెస్టారెంట్ ఉద్యోగుల పని ఒత్తిడిని లండన్ లోని లీయోన్ అనే ఫుడ్ రెస్టారెంట్ తొలగిస్తోంది. సాధారణంగా రెస్టారెంట్ లో పని చేసే ఉద్యోగులు యజమానుల నుంచి, కస్టమర్ల వరకు సమన్వయం చేయడంలో పలు సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎంత కష్టపడ్డా విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని యజమాని, కస్టమర్ ల ఆగ్రహానికి గురవుతుంటారు. దీంతో ఈ విధుల్లో ఉండేవారు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి ఒత్తిడిని తట్టుకునేందుకు పరిశోధకులు విధుల్లో చేరే ముందు పది నిమిషాలు నచ్చిన డాన్స్ చేయాలని సూచించి మంచి ఫలితాలు పొందారు. మరి కొంత మందిని మెత్తని దిండ్లతో కొట్టుకొమ్మని చెప్పి ఒత్తిడి తగ్గించారు. అయితే లీయోన్ రెస్టారెంట్ మాత్రం ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు వింగ్ చున్ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తోంది. దీంతో ఈ రెస్టారెంట్ నిర్వాహకులు ఉత్తమ ఫలితాలు సాధించారు. వింగ్ చున్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ప్రశాంతత మెరుగుపడిందని లీయోన్ సహవ్యవస్థాపకుడు జాన్ విన్సెంట్ తెలిపారు. ఆరు నెలల పాటు ఉద్యోగులకు వింగ్ చున్ లో శిక్షణ ఇప్పించి వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించగా, వారి గుండె వేగం, ఆత్మవిశ్వాస స్థాయి పెరిగాయని తెలిపారు.