: 5 వికెట్లు తీయడమంటే ఒక బ్యాట్స్ మన్ సెంచరీ చేయడమన్న మాట: అశ్విన్
ఒక బౌలర్ 5 వికెట్లు తీయడమంటే ఆ మ్యాచ్ లో బ్యాట్స్ మన్ సెంచరీ చేసినట్టు లెక్కవేసుకోవాలని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఇండోర్ లో జరుగుతున్న మూడోటెస్టు మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో కేవలం 39 టెస్టుల్లో 20 టెస్టుల్లో ఐదు వికెట్ల ఫీట్ సాధించిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. దీంతో మూడోరోజు ఆట అనంతరం అశ్విన్ మాట్లాడుతూ, పిచ్ అనుకూలించిందని అన్నాడు. టర్న్ రాబట్టడంతో వికెట్లు తీయడం సులువైందని చెప్పాడు. బ్యాట్స్ మన్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుండగా, వికెట్లు రాబట్టడం కష్టమని తెలిపాడు. వన్డేల్లో బ్యాట్స్ మన్ పరుగుల కోసం ప్రయత్నిస్తారని, అలాంటప్పుడు వారిని ఉచ్చులోకి లాగవచ్చని, టెస్టుల్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించే వారిని అవుట్ చేయడం కష్టమని అభిప్రాయపడ్డాడు. అందుకే ఒక బౌలర్ 5 వికెట్లు తీయడమంటే బ్యాట్స్ మన్ గా సెంచరీ సాధించినంత గొప్ప అని తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసిన అశ్విన్ రెండు రన్ అవుట్ లు కూడా చేశాడు. దీంతో అశ్విన్ పరోక్షంగా 8 వికెట్లు తీశాడు. జడేజా రెండు వికెట్లు తీయడం విశేషం.