: బంగ్లా, ఇంగ్లండ్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం
బంగ్లాదేశ్ క్రికెటర్లతో ఇంగ్లండ్ క్రికెటర్లు వాగ్వాదానికి దిగడం మైదానంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఇంగ్లండ్ జట్టు బంగ్లదేశ్ టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య తొలి వన్డేలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఎల్బీడబ్ల్యూగా అవుటైన సందర్భంలో ఈ వివాదం చోటుచేసుకుంది. బంగ్లా ఆటగాళ్లంతా జోస్ బట్లర్ ఎల్బీడబ్ల్యూను అవుట్ గా పేర్కొంటూ అప్పీలు చేయగా, ఫీల్డ్ అంపైర్ దానిని తోసిపుచ్చాడు. దీంతో బంగ్లా కెప్టెన్ ముషారఫ్ మొర్తజా అంపైర్ నిర్ణయంపై రివ్యూ కోరాడు. రివ్యూలో అవుట్ గా థర్డ్ అంపైర్ నిర్ణయించడంతో బట్లర్ అవుటయ్యాడంటూ ఫీల్డ్ అంపైర్ ప్రకటించాడు.
దీంతో బంగ్లా ఆటగాడు మొహ్మదుల్లా అత్యుత్సాహంతో బట్లర్ కు పెవిలియన్ చూపించాడు. దీంతో బట్లర్ అతనివైపు దూసుకొచ్చాడు. ఈ దశలో బంగ్లా ఆటగాళ్లంతా అతనికి మద్దతివ్వడంతో నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న వోక్స్ తన కెప్టెన్ కు మద్దతుగా నిలిచాడు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదాన్ని ఆపేందుకు ఫీల్డ్ అంపైర్లు నానా తంటాలు పడ్డారు. అనంతరం మ్యాచ్ గెలిచిన అనంతరం తమ స్పందనను తెలియజేసిన సందర్భంలో తమీమ్ ఇక్బాల్ తో ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆటతీరు కంటే మాటతీరుతోనే ఈ మ్యాచ్ బాగా ఆకట్టుకుందని కామెంట్లు వినిపించాయి.