: బీహార్ 'టాపర్' రూబీ ఆన్సర్ షీట్లలో అసలు విషయం నిల్!
‘పాలిటిక్స్’ అంటే .. ‘వంట శాస్త్రం’ అని చెప్పి, అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన బీహార్ టాపర్ రూబీ రాయ్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జరిగిన బీహార్ ఇంటర్ బోర్డు పరీక్షల్లో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో రూబీ టాపర్ గా నిలిచింది. అయితే, ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమెను ప్రశ్నించగా సబ్జెక్ట్ కు సంబంధించిన డొల్లతనం బయటపడటంతో పాటు, పొంతన లేని సమాధానాలు చెప్పడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. ఆ తర్వాత ఆమె 'దొంగ టాపర్' అన్న విషయం వెల్లడైంది. ఈ వ్యవహారంపై మరిన్ని ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగుచూశాయి. రూబీ తన ఆన్సర్ షీట్లను సినిమాల పేర్లు, పలు కవితలతో నింపేసిందట. ముఖ్యంగా ప్రముఖ కవి తులసీదాస్ పేర్లు వందకుపైగా ఆన్సర్ షీట్లలో దర్శనమిచ్చాయట. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, రూబీ ఆన్సర్ షీట్లను పేపర్ వాల్యుయేషన్ చేసే నిపుణులు మార్చారని పోలీసులు చెప్పారు. వేరే వ్యక్తి చేతి రాతతో ఉన్న పేపర్లను రూబీ ఓఎంఆర్ షీటుకు కట్టారని చెప్పారు. కాగా, రూబీ రాయ్ ఆర్ట్స్ విభాగంలో టాపర్ గా నిలిచింది. పొలిటికల్ సైన్స్ పై ఆ అమ్మాయికి ఏమాత్రం అవగాహన లేదన్న విషయం మీడియా ఇంటర్వ్యూలో తేలింది. దీంతో, ఈ వ్యవహారంపై పోలీసులు కూపీలాగడంతో అసలు విషయం బయట పడింది. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 40 మందిని అరెస్టు చేశారు. అయితే, పొలిటికల్ సైన్స్ లో తనకు పాస్ మార్కులు వస్తే చాలనుకున్నానని, టాపర్ గా నిలవాలని తానెన్నడూ కోరుకోలేదని, తన తండ్రి కారణంగా ఈ తప్పుడు మార్గం అవలంబించాల్సి వచ్చిందని రూబీ గతంలో పేర్కొంది.