: ఆర్డర్ ఇవ్వగానే ఆయుధాలు ఇవ్వాలి... బీ ప్రిపేర్డ్: ఢిఫెన్స్ సంస్థలకు మోదీ ఆదేశం


భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ఆయుధ సరఫరా కంపెనీలకు మోదీ ప్రభుత్వం నుంచి కీలక సూచనలు వెళ్లాయి. ఏ క్షణమైనా కేంద్రం నుంచి ఆర్డర్లు వస్తాయని, వెంటనే ఉత్పత్తిని పెంచి, స్వల్ప వ్యవధిలో ఆయుధాలు, మందుగుండు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్ కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ విషయాన్ని కేంద్ర ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి. భారత సాయుధ దళాల తక్షణ అవసరాలను తీర్చేలా ఆయుధాలు, మందుగుండు నిల్వలు పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఇండియాలో ఆయుధాల తయారీలో ఉన్న కంపెనీలకు సమాచారం అందించామని, వారు సైతం ప్రొడక్షన్ ను పెంచేందుకు సిద్ధంగానే ఉన్నారని, ఆర్డర్ ఇవ్వగానే డిమాండ్ మేరకు ఆయుధాల సరఫరా జరుగుతుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా సుఖోయ్, మిరేజ్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించగల చిన్న చిన్న క్షిపణులు అధికంగా కావాల్సి వుంటుందని, మిగతా మందుగుండు సామాగ్రి తదితరాలను ప్రాధాన్యతా పూర్వక మార్గంలో ఆర్డర్ ఇవ్వాలన్నది తమ అభిమతమని ఆయన తెలిపారు. కాగా, సర్జికల్ దాడులకు ముందే, దేశ అవసరాల దృష్ట్యా, రక్షణ శాఖ బడ్జెట్ ను మరింతగా పెంచే ఆలోచనలో ఉన్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News