: స్వర్ణ కాంతులతో ధగధగలాడిన భద్రకాళి
వరంగల్ భద్రకాళి అమ్మవారు సరికొత్త బంగారు కాంతులతో ధగధగలాడుతూ తనను నమ్మి కొలిచే భక్తులకు దర్శనమిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 3.70 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం, పాదాలు, జటాఝూటం తదితరాలను బహూకరించగా, ఆలయ పూజారులు వాటిని అమ్మవారికి అలంకరించారు. పరదాలు వేసి, అమ్మకు ఆభరణాలను అలంకరిస్తున్న వేళ, కేసీఆర్ గర్భాలయం బయటే వేచివున్నారు. అలంకరణ తరువాత అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు బాటలో నడిపించాలని భద్రకాళి అమ్మను కోరినట్టు ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వరంగల్ వెళ్లేందుకు వాతావరణం అనుకూలించని కారణంగా, రోడ్డు మార్గానే కేసీఆర్ దంపతులు వరంగల్ చేరుకున్నారు. వారికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.