: అందాలు ఆరబోస్తూ వస్తుంది... యువత వద్ద ఫోన్లు కొట్టేసి జంప్ అవుతుంది... ఢిల్లీ కి'లేడీ' కథ!
అందంగా తయారవుతోంది.. హుందాగా కనిపిస్తోంది.. హోండా బ్రయో కారులో తిరుగుతోంది. ఆంగ్లభాషలో అదరగొడుతూ సంభాషిస్తోంది. ఆపై ఖరీదైన వస్తువులు కాజేసి జంపైపోతోంది. న్యూఢిల్లీలో ఓ 25 ఏళ్ల యువతి చేస్తోన్న ఈ మోసం ఇటీవలే బయటపడింది. చూడముచ్చటగా మాట్లాడుతూ కుర్రాళ్ల వద్దకు వచ్చి వారి వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లను తీసుకుని పారిపోతున్న ఈ లేడీ కిలాడీ గురించి ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు ఆమెను పట్టుకోవడానికి నాలుగు టీమ్‌లను నియమించారు. అయినప్పటికీ ఇంకా వారికి దొరకలేదు ఆ యువతి. ఖరీదయిన కారులో వస్తోన్న యువతి రోడ్డుపక్కన ఉన్న యువకులే లక్ష్యంగా తన గారడి మొదలుపెడుతుందని పోలీసులు తెలిపారు. కారులో వచ్చి యువకులను ఒక అడ్రస్ పై ఆరా తీస్తున్నట్లు మాట్లాడుతుందని చెప్పారు. తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని ఒక్క కాల్ చేసుకుంటానని చెప్పి యువకుల వద్ద నుంచి ఫోన్లు తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె సిద్ధంగా ఉంచుకున్న కారులో పారిపోతోందని చెప్పారు. మూడు రోజుల్లోనే నలుగురు కుర్రాళ్ల నుంచి ఆమె స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు కొట్టేసింది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఆమె తాజాగా ఓ యువతిని మోసం చేసింది. ఆ యువతి ఫోను అడిగిన సమయంలో ఆమె నిజంగానే ఏదో అత్యవసర పరిస్థితిలో ఉందనుకున్నానని ఆమె చేతిలో మోసపోయిన చేతన అనే విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయం చేద్దామని తన వద్ద ఉన్న టాబ్ ఆమెకు ఇస్తే దాన్ని తీసుకుని పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ యువతిని వెంబడించేందుకు ప్రయత్నించినా తప్పించుకుని పారిపోయిందని చెప్పింది. ఇటువంటి ఫిర్యాదులే యువత నుంచి పోలీసులకు మరికొన్ని వచ్చాయి.