: ద్రవిడ్ వల్లే నేను ఇలా తయారయ్యాను: క్రికెటర్ సంజు శాంసన్
టీమిండియా దిగ్గజం, ఇండియా 'A' జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ వల్లే తాను మంచి క్రికెటర్ గా రూపొందానని కేరళ వర్ధమాన క్రికెటర్ సంజు శాంసన్ తెలిపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్ము కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్ లో తొలిరోజు 142 పరుగులతో అజేయంగా నిలిచిన శాంసన్ మాట్లాడుతూ, ద్రవిడ్ తో గడిపే ప్రతిక్షణం ఎంతో విలువైనదని అన్నాడు. ఆయన నుంచి ఎంతో నేర్చుకుంటామని చెప్పాడు. ఆయన సాహచర్యాన్ని ప్రతి క్రికెటర్ ఎంతగానో ఆస్వాదిస్తాడని తెలిపాడు. ఇండియా 'ఎ' జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రతి ఆటగాడు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాడని తెలిపాడు. క్రీజులో అడుగుపెట్టిన తరువాత పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ద్రవిడ్ సూచించాడని, బౌలర్ కూడా వికెట్లు తీయాలని సన్నద్ధమై వస్తాడని, అందుకే వారిని గౌరవించాలని ద్రవిడ్ ఎప్పుడూ చెబుతుంటాడని సంజు శాంసన్ చెప్పాడు. కాగా, ద్రవిడ్ సారధ్యంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ కు సంజు శాంసన్ ప్రాతినిధ్యం వహించాడు.