: ముగిసిన స్పెక్ట్రమ్ వేలం... గరిష్ఠ తరంగాలు ఎయిర్ టెల్ సొంతం


ఇండియాలో నిర్వహించిన అతిపెద్ద వాయు తరంగాల వేలం టెల్కోల నుంచి ఆశించిన స్పందన లేక పేలవంగా ముగిసింది. రూ. 5.60 లక్షల కోట్లను ఖజానాకు చేర్చాలన్న లక్ష్యంతో వివిధ బ్యాండ్లలోని 2,354.55 మెగాహెర్జ్ ల వాయు తరంగాలకు వేలం నిర్వహించగా, కేవలం 965 మెగాహెర్జ్ తరంగాలే అమ్ముడయ్యాయి. రూ. 65,789 కోట్ల విలువైన తరంగాలకు టెలికం సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. మొత్తం 31 రౌండ్ల పాటు వేలం జరుగగా, 700 మెగాహెర్జ్ బ్యాండ్ ను కోసం ప్రయత్నించిన వారే లేకపోవడం గమనార్హం. గత సంవత్సరం 19 రోజుల పాటు వేలం నిర్వహించగా, రూ. 1.1 లక్షల కోట్ల ఆదాయం లభించిన సంగతి తెలిసిందే. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యులార్, టాటా టెలీ సర్వీసెస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్ సెల్ సంస్థలు వేలంలో పాల్గొన్నాయి. ఈ వేలంలో ఎయిర్‌ టెల్ 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ ను రూ.14,244 కోట్లకు సొంతం చేసుకుంది. వచ్చే 20 ఏళ్లకు సరిపడా తరంగాలు తమ వద్ద ఉన్నాయని, అన్ని సర్కిళ్లలో తమకు 3జీ, 4జీ తరంగాలున్నాయని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఐడియా సెల్యులార్ రూ. 12,798 కోట్ల విలువైన తరంగాలను కొనుగోలు చేసింది. 700 మెగాహెర్జ్‌ తోపాటు 900 మెగాహెర్జ్ బ్యాండ్‌ ల స్పెక్ట్రమ్‌ కు ధర అధికంగా ఉన్నందునే టెలికం కంపెనీల నుంచి స్పందన కరవైందని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తరంగాల విక్రయానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ. 32 వేల కోట్ల రూపాయలు రానున్నాయని టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. గడచిన ఐదేళ్లలో ఇదే అత్యధికమని తెలిపారు.

  • Loading...

More Telugu News