: గత వేసవిలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకూడదు.. మైండ్ సెట్ మార్చుకోండి: కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం
గత వేసవిలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా ఉండేలా చూసుకోవాలని, వచ్చే వేసవి సమయానికి కరవును తట్టుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని, మైండ్ సెట్ మార్చుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు తలంటింది. గతంలో మాదిరిగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశముంది కనుక ముందస్తు చర్యలు చేపట్టాలని కోరుతూ స్వరాజ్ అభియాన్ అనే ఎన్జీవో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు కేంద్రానికి హెచ్చరికలు చేసింది. దేశంలో కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ముందునుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. గత వేసవిలో మహారాష్ట్రలోని మరాఠ్వాడా సహా దేశంలోని పలు ప్రాంతాలు తీవ్ర కరవుతో అల్లాడిపోయిన సంగతిని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. గతంలో సరైన సమయంలో కరవు ప్రాంతాలుగా ప్రకటించలేదని, అదే తప్పు మళ్లీ చేయవద్దని చెప్పింది. ‘ఇల్లు కాలుతున్నప్పుడే బావి తవ్వే ప్రయత్నం చేయకండి’ అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు వేసింది.