: అభిమానులకు నచ్చింది చేయడానికి రాలేదు...టాలెంట్ అమ్ముకోడానికొచ్చాను: కరీనా కపూర్
సినీరంగ ప్రవేశం చేసిన తొలినాళ్లలో సినీ తారలు చెప్పే మాటలకు.. స్టార్ డమ్ సంపాదించుకున్న తరువాత చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుందని కరీనా కపూర్ నిరూపిస్తోంది. తాను అభిమానులకు నచ్చింది చేసేందుకు సినీ పరిశ్రమకు రాలేదని, తన టాలెంట్ అమ్ముకునేందుకు మాత్రమే బాలీవుడ్ కు వచ్చానని చెబుతోంది. అభిమానులను స్నేహితులుగా మార్చుకోవాలన్న కోరిక తనకు లేదని కరీనా స్పష్టం చేసింది. తన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు, తనపై నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే తనతో సినిమాలు చేయాలనుకుంటారని, వారితోనే తాను సినిమాలు చేస్తున్నానని కరీనా చెప్పింది. ఏదైనా పాత్రకు అభ్యంతరం చెబితే అది తనకు నప్పదని అర్థమని పేర్కొంది. దానిని ఎందుకు తిరస్కరించానన్న విషయంలో ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని కరీనా తెలిపింది. పెళ్లైన వారితో ఖాన్ లు నటించరన్న అభిప్రాయం సరికాదని, వారు ఎవరితోనైనా నటిస్తారంటూ వారి తరపున వకాల్తా పుచ్చుకుని మరీ కరీనా చెప్పింది.