: తాగుబోతుల ర్యాష్ డ్రైవింగు బారిన పడ్డ 'చిన్నారి సంజన' పరిస్థితి విషమం
హైదరాబాదులోని పెద్ద అంబర్ పేట బస్టాండ్ లో బస్సు కోసం ఎదురుచూస్తోన్న తల్లీకూతుళ్లను కారు ఢీ కొట్టిన సంగతి, ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన సంజన (5) బ్రెయిన్ డెడ్ కు గురైన సంగతి తెలిసిందే. వెంటిలేటర్ పై ఉన్న సంజన పరిస్థితి ఇప్పుడు మరింత విషమించిందని తెలుస్తోంది. కాగా, మద్యం సేవించి ఒళ్లు తెలియకుండా కారు నడుపుతూ వీరిని యాక్సిడెంట్ చేసిన వెంకటరమణ, యాదిరెడ్డి, శ్రీనివాస్ కు బెయిల్ లభించడం విశేషం. దీనిపై బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్సిడెంట్ కు గురైన బాధితులు ఆసుపత్రి నుంచి బయటకు రాకముందే నిందితులకు బెయిల్ ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారిని పోలీసులకు అప్పగిస్తే.. వారు ఎలా బయటకు రాగలిగారని నిలదీశారు. దీనిపై ఆందోళనకు దిగుతామని వారు స్పష్టం చేశారు. కాగా, గతంలో ఇలా బాధ్యత లేకుండా మద్యం తాగి కారు నడుపుతూ పంజాగుట్టలో రమ్య అనే చిన్నారిని బలిగొన్న సంగతి తెలిసిందే.