: పన్ను చట్టాల లొసుగులతో లాభపడింది నిజమే: అంగీకరించిన ట్రంప్
అమెరికా పన్ను చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా తన కంపెనీలు లాభపడిన మాట వాస్తవమేనని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. తాను ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడినైతే, లొసుగులన్నీ తొలగించి పూర్తి పాదర్శకంగా ఉండే కొత్త చట్టాన్ని తెస్తానని తెలిపారు. "మన పన్ను చట్టాల్లో నమ్మలేనంత లొసుగులున్నాయి. ఇదే విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతూ వస్తున్నా. నిజం చెప్పాలంటే, నేనూ చాలా లాభపడ్డా" అని ఈఎఫ్ఈ న్యూస్ కు ట్రంప్ వెల్లడించారు. "ఇప్పుడు నేను ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నా. ట్రంప్ కోసం కాదు" అని ఆయన అన్నారు. కాగా, 18 సంవత్సరాల క్రితం తన కంపెనీకి 915.7 మిలియన్ డాలర్ల నష్టం వచ్చిందని చూపిస్తూ, ఆపై కొన్ని సంవత్సరాల పాటు ఆయన పన్ను రాయితీలను అనుభవించి బిలియన్ల కొద్దీ డాలర్లను వెనకేసుకుని, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.