: ఎయిర్ ఆసియా విమాన ప్రయాణికులకు బంపరాఫర్.. రూ. 999కే దేశంలోని ముఖ్యనగరాలకు వన్‌వే టికెట్
ఎయిర్ ఆసియా విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ.999 ప్రారంభ ధరతో బెంగళూరు, కోచి, హైదరాబాద్, న్యూఢిల్లీ, గువాహటి, జైపూర్, పుణె, ఇంఫాల్ తదితర నగరాలకు (వన్ వే) ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, ఫుకెట్, మెల్‌బోర్న్, సిడ్నీ వంటి అంతర్జాతీయ నగరాలకు టికెట్ ప్రారంభ ధరను రూ.3,599గా పేర్కొంది. ఈనెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో బుక్ చేసుకున్న ప్రయాణికులు నేటి (మంగళవారం) నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 27 వరకు ప్రయాణించవచ్చని తెలిపింది. తమ ఫేస్‌బుక్ ఫాలోవర్ల సంఖ్య పది లక్షలు దాటడంతో దానిని సెలెబ్రేట్ చేసుకునేందుకే ఈ ఆఫర్ ప్రకటించినట్టు సంస్థ ఇండియా సీఈఓ అమర్ అబ్రోల్ పేర్కొన్నారు.