: జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అపోలో వైద్యులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ‍్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసేలా అపోలో వైద్యుల్ని ఆదేశించాలంటూ చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఇవాళ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆమెకు చికిత్సనందిస్తున్న వైద్యులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జయలలిత చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. నిన్నటికంటే నేడు ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని అన్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆమె ఆరోగ్యపరిస్థిితిని నిత్యం పర్యవేక్షిస్తోందని చెప్పారు. మరికొన్ని రోజులు ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలోనే ఆమె ఉంటారని వారు స్పష్టం చేశారు. కాగా, ఆమెను చూసేందుకు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపోలో ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకుంటున్నారు.