: వాషింగ్టన్ లో ట్రంప్ హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న నల్లజాతీయులు
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, నల్లజాతీయుల పట్ల అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ, గుర్తు తెలియని కొందరు ఆయన హోటల్ ను టార్గెట్ చేసుకున్నారు. వాషింగ్టన్, డౌన్ టౌన్ లోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ పై దాడి చేసి గోడలపై నినాదాలు రాశారు. తమకు అన్యాయం జరుగుతోందని, శాంతి లేదని, నల్లజాతీయులు జీవించడమే తప్పైపోయిందని నల్ల సిరాతో రాశారు. ఈ పని ఎవరు చేశారన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా, ఓ వ్యక్తి ట్రంప్ హోటల్ పై నినాదాలు రాసి, తాపీగా మెట్లు దిగి నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై స్పందించేందుకు ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రతినిధులు నిరాకరించారు. ఈ ఘటన తరువాత హోటల్ ముందు సెక్యూరిటీని పెంచినట్టు వివరించారు. కాగా, మొత్తం 263 రూములున్న ఈ హోటల్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ కు సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ ఓ రాత్రి గడపాలంటే, 895 డాలర్లను వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్రచారంలో బిజీగా ఉన్న ట్రంప్ వాషింగ్టన్ కు ఎప్పుడు వచ్చినా, ఇక్కడే బస చేసి, తన ప్రచార టీమ్ తో మంతనాలు జరుపుతారు.