: భారత్ చేతుల్లోకి చారిత్రక టెస్ట్.. న్యూజిలాండ్‌కు కష్టకాలం


కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న చారిత్రక 250వ టెస్ట్ మ్యాచ్ దాదాపు భారత్ చేతుల్లోకి వచ్చేసింది. టీమిండియా మరో చారిత్రక విజయం దిశగా సాగుతోంది. అద్భుతాలు జరిగితే తప్ప న్యూజిలాండ్ ఓటమి ఖాయం. కివీస్ టెయిలెండర్లను పెవిలియన్ పంపడం ఆలస్యం చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టపటపా వికెట్లు రాల్చుకున్నా మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. వికెట్లు త్వరత్వరగా నేలకూలుతున్న వేళ స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ 132 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి రెండో ఇన్సింగ్స్‌లో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లీ(45), వృద్ధిమాన్ సాహా(39 బ్యాటింగ్) పోరాటంతో మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సాహా, భువనేశ్వర్(8) ఉన్నారు. న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఓవరాల్‌గా 339 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. కాగా ఈడెన్‌ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన 117 పరుగులే కావడంతో భారత్ విజయం నల్లేరుమీద నడకేనని భావిస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో టీమిండియా తడబడింది. లంచ్ సమయానికి వికెట్ కోల్పోకుండా 12 పరుగులు మాత్రమే చేసిన భారత్‌ను కివీస్ బౌలర్లు అద్భుత పేస్‌తో బెంబేలెత్తించారు. హెన్రీ(3/44), బౌల్ట్(2/28) వీర విజృంభణతో భారత్ ఒక దశలో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడింది. లంచ్ తర్వాత విజయ్(7), పుజారా(4), ధావన్(17), రహానే(1) వికెట్లను కూడా కోల్పోయిన దశలో కెప్టెన్ కోహ్లీ సమయోచితంగా ఆడాడు. కఠిన పరిస్థితుల్లో కివీస్ బౌలర్లను ఎదురొడ్డి జట్టును ఆదుకున్నాడు. రోహిత్‌‌శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో ఉన్న కోహ్లీ ఎల్బీగా వెనుదిరగడంతో 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే అశ్విన్(5) ఔటైనా రోహిత్ మాత్రం బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సాహాతో కలిసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. సాహాతో కలిసి 103 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రోహిత్ 82 పరుగులు చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 128/7తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ను భారత్ బౌలర్లు త్వరగా పెవిలియన్ పంపడంలో విఫలమయ్యారు. మూడేళ్ల తర్వాత టెస్ట్‌మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ భారత బౌలర్లను విసిగించాడు. జీనత్ పోరాటంతో కివిస్ స్కోరు 200 పరుగులు దాటింది. జీనత్‌ను అశ్విన్ వెనక్కి పంపగా, వాట్లింగ్, వాగ్నర్‌లను షమీ(3/70) పెవిలియన్‌కు పంపడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

  • Loading...

More Telugu News