: తెలంగాణ, కోస్తాంధ్రలను మళ్లీ ముంచెత్తనున్న వానలు
తెలంగాణ, కోస్తాంధ్రలను మళ్లీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా, రాగల నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనం సుమారు 5.8 కిలోమీటర్ల నుంచి 9.5 కిలోమీటర్ల మధ్య వ్యాసార్థంతో ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీనికి తోడు దక్షిణ చత్తీస్ గఢ్ ను ఆనుకుని ఉన్న విదర్భ, తెలంగాణల్లో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వారు చెప్పారు. ఈ రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా రాగల నాలుగు రోజుల్లో కోస్తాంధ్రతో పాటు తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు తెలిపారు. సోమ, మంగళ వారాల్లో వీటి ప్రభావం ఉంటుందని వారు చెప్పారు.