: భారత్ అందుకే రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తోంది: చైనా పత్రికలు గగ్గోలు


ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ కు దిగిన నేపథ్యంలో భారత సరిహద్దు దేశాల్లోని మీడియా భారత సాహసంపై కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో భారత యుద్ధతంత్రం, భారత సైన్యం సామర్థ్యం, భారత అమ్ములపొదిలో ఉన్న ఆయుధాలు.. ప్రయోగించగల సామర్థ్యం వంటి వివరాలపై కథనాలు ప్రసారమయ్యాయి. ప్రధానంగా పాకిస్థాన్ కు ఆపద్బంధుగా ఉన్న చైనా మీడియా భారత సైన్యం సాయుధ సంపత్తిపై గుండెలు బాదుకుంటోంది. ఈ మేరకు భారత సాయుధ సంపత్తిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. అందులో ప్రధానంగా ఫ్రాన్స్- భారత్ చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశం ఎందుకు కొనుగోలు చేస్తోంది, అణ్వస్త్రాలను పాకిస్థాన్, చైనాల మీద ప్రయోగించడానికేనా? అంటూ, సవివరమైన కథనాలు ప్రసారం చేసింది. ఆయుధాల కొనుగోళ్లలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని ఈ కథనాల్లో ఆరోపించింది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రఫేల్ జెట్ విమానాలకు అణు వార్‌ హెడ్లను తీసుకెళ్లగల సామర్థ్యం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మూడేళ్లలో ఇవి భారత్ కు అందుబాటులోకి వస్తే... భారత అణ్వస్త్ర సామర్థ్యం ఉన్నపళంగా రెట్టింపు అవుతుంది. భారత భూభాగం నుంచే పాకిస్థాన్, చైనాలపై అణ్వాయుధాలను ప్రయోగించే సత్తా భారత్ సొంతమవుతుందని ఆ మీడియా పేర్కొంది. భారతదేశం సుమారు 85 వేల కోట్ల రూపాయలతో 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్, చైనాలను ఒకేసారి ఎదుర్కోవాలంటే భారత వైమానిక దళానికి 45 ఫైటర్ స్క్వాడ్రన్ లు అవసరం వుండగా, ప్రస్తుతం భారత్ వద్ద 33 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. ప్రతిదాంట్లో 18 చొప్పున యుద్ధవిమానాలున్నాయి. దీంతో 'చైనాను బూచి'గా చూపించి భారత్ సహా సరిహద్దు దేశాలన్నీ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయని చైనా మీడియా తెగ బాధపడిపోయింది. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసే రఫేల్ యుద్ధ విమానాలను భారతదేశం పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోనే మోహరిస్తుందని చైనా మీడియా కథనాలు ప్రసారం చేసింది. అంతేకాకుండా భారత్ కు నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఇప్పటివరకు 6.66 లక్షల కోట్ల రూపాయలను ఆయుధాల కొనుగోలుకు, సైనిక సామర్థ్యాన్ని పెంచుకోడానికి ఖర్చు చేశారని చైనా మీడియా గుండెలు బాదుకుంది. భారత్ తో పాటు వియత్నాం, దక్షిణ కొరియా కూడా టాప్ 10 ఆయుధాల కొనుగోలు దేశాల్లో స్థానం సంపాదించాయని చైనా మీడియా తెలిపింది.

  • Loading...

More Telugu News