: ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రెడీ... మరి నేవీ?
లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ) వద్ద పూర్తి స్థాయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందా? అన్నంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి. ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు దేశాల ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. భారత్ గత రాత్రే పాకిస్థాన్ కు సత్తా చూపడంతో పాకిస్థాన్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగుతుందనే విషయాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో దుర్భేద్యమైన నావికా దళం ఏం చేస్తోందంటూ సర్వత్రా ఆసక్తి రేగుతోంది. మామూలుగానే త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉంటాయి. ప్రపంచంలోనే శక్తిమంతమైన నావికా దళాల్లో ఒకటైన భారత్ నేవీ మరింత అప్రమత్తంగా ఉంది. గుజరాత్ నుంచి ఉన్న తీరరేఖ ప్రాంతం మొత్తాన్ని ఇండియన్ నేవీ స్వాధీనం చేసుకుంది. పాక్ ఎలాంటి దుందుడుకు చర్యలకు దిగినా గుణపాఠం చెప్పేందుకు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఘటనను పాక్ ఇంతటితో ముగిస్తే మంచిదని యుద్ధ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో ప్రపంచ దేశాలకు భారత్ గట్టి సందేశం పంపిందని వారు చెబుతున్నారు. అవసరమైతే భారత్ కఠినంగా స్పందిస్తుందని, ఇండియన్ ఆర్మీకి భారతీయులంతా మద్దతుగా నిలుస్తున్నారని అర్ధమైందని వారు భావిస్తున్నారు. ఇంతకంటే భారత్ ఇప్పటికిప్పుడు చేయాల్సిందేమీ లేదని, ఇకపై పాకిస్థాన్ ఏం చేసినా ప్రపంచం ముందు దోషిగా నిలబడుతుందని వారు సూచిస్తున్నారు.